బీసీలకు 47% రిజర్వేషన్ అమలు చేయాలి..!!

బీసీలకు న్యాయంగా దక్కాల్సిన రిజర్వేషన్లను అమలు చేసే వరకూ దేశవ్యాప్తంగా ఉద్యమించాల్సిన అవసరం ఉందని బిహార్ మాజీ సీఎం బీపీ మండల్ మనవడు సూరజ్ మండల్ పిలుపునిచ్చారు. ఇందుకోసం దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఉన్న బీసీలు ఒక్క రోజు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టాలని సూచించారు. హనుమకొండ సుబేదారిలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానంలో ఆదివారం బీసీ రాజకీయ యుద్ధభేరి సభ జరిగింది. బీసీలకు 47 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ కింద 10శాతం రిజర్వేషన్‌ను రద్దు చేయాలని సదస్సులో పాల్గొన్న వక్తలు ముక్త కంఠంతో డిమాండ్ చేశారు. ముఖ్య అతిథిగా సూరజ్ మండల్ మాట్లాడుతూ ‘మన ఓటు-మన సీటు’ తోనే రాజ్యాధికారం సాధ్యమని అభిప్రాయపడ్డారు. జనాభా దామాషా ప్రకారం బీసీలకు రిజర్వేషన్లను అమలు చేయడంలో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని విమర్శించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు చట్టబద్ధంగా దక్కాల్సిన హక్కులను కాలరాసేందుకు కుట్ర చేస్తోందని ఆరోపించారు.
జనగణన చేపడితే.. బీసీలకు రిజర్వేషన్లు పెంచాల్సి వస్తుందన్న కారణంతోనే వెనుకడుగు వేస్తోందని ఆరోపించారు. ఈ విషయమై బీజేపీ ఎంపీ ఆర్.క్రిష్ణయ్య పార్లమెంట్‌లో గళమెత్తాలని కోరారు. బీసీల న్యాయబద్ధమైన పోరాటానికి తన సంపూర్ణ మద్దతు ఉంటుందని ప్రకటించారు. డీఎంకే ఎంపీ విల్సన్ మాట్లాడుతూ బీసీల రిజర్వేషన్ల అమలులో కేంద్ర, పలు రాష్ట్ర ప్రభుత్వాలు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. 1980 తర్వాత బీసీల రిజర్వేషన్లు పెరగలేదని గుర్తు చేశారు. బీసీలకు న్యాయబద్ధంగా రిజర్వేషన్లు అమలు చేయడంలో తమిళనాడు ఆదర్శంగా నిలుస్తోందన్నారు. ఏ గణన లేకుండా, రాజ్యాంగాన్ని సవరించకుండా ఈడబ్ల్యూఎస్ కేటగిరీ కింద 10 శాతం రిజర్వేషన్లను అమలు చేయడాన్ని విల్సన్ తప్పుపట్టారు. బీసీల హక్కులను కాలరాయడానికి, వక్ఫ్ ఆస్తులను కొల్లగొట్టడానికి కేంద్రం వన్ నేషన్-వన్ ఎలక్షన్ విధానం తీసుకురాబోతుందన్నారు.
జనాభా దామాషా ప్రకారం బీసీల రిజర్వేషన్ల అమలుకు వరంగల్ సభ దిక్సూచి కావాలని అన్నారు. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ ఓసీలకు 10శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అమలు చేయడంతో బీసీలకు ఉద్యోగాలు దక్కకుండా పోతున్నాయన్నారు. వచ్చే ఎమ్మెల్సీ, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ నేతలను గెలిపించాలని కోరారు. రాష్ట్రంలో చివరి బీసీయేతర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డే అని, 2029లో బీసీనే సీఎంగా ఉంటారని పేర్కొన్నారు. బీసీ సంఘాల జాతీయ అధ్యక్షుడు ఆర్.క్రిష్ణయ్య మాట్లాడుతూ రాష్ట్రంలో సర్పంచ్‌లు, ఎంపీటీసీలుగా బీసీలు గెలిస్తే అగ్రకులాలు ఓర్వలేకపోతున్నాయన్నారు. కులం పేరుతో రాజకీయాలు చేస్తూ బీసీల ఐక్యతను దెబ్బతీస్తున్నాయని విమర్శించారు. రాష్ట్రంలో ప్రతీ బీసీ కుటుంబానికి బీసీ బంధు ద్వారా రూ.10లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
