6రోజులు..6అబద్ధాలు..66మోసాలు..?
తెలంగాణ ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన విజయోత్సవాలకు వ్యతిరేకంగా తెలంగాణ రాష్ట్ర బీజేపీ వ్యతిరేక కార్యక్రమాలను చేపట్టాలని నిర్ణయించింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈరోజు వర్కు షాపు ప్రారంభమైంది.
ఈ వర్కుషాపులో రేపటి నుండి డిసెంబర్ ఆరో తారీఖు వరకు నిరసన కార్యక్రమాలను చేపట్టాలని నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా డిసెంబర్ రెండు,మూడో తారీఖున రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో బైకు ర్యాలీలు నిర్వహించాలి. డిసెంబర్ నాలుగు, ఐదో తారీఖున నియోజకవర్గ కేంద్రాల్లో రెండు వేల మందితో సభలను నిర్వహించాలని తలపెట్టింది.
గత ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీల అమల్లో విఫలమైన కాంగ్రెస్ ప్రభుత్వ తీరును ప్రజల్లో ఎండగట్టాలి. రైతులను యువతను మహిళలను ఏవిధంగా మోసం చేసిందో ఆరు రోజులు.. ఆరు అబద్ధాలు.. అరవై ఆరు మోసాల పేరుతో వ్యతిరేక కార్యక్రమాలను చేపట్టాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వివరించారు.