బకాయిలు విడుదల చేయండి
ధాన్యం సేకరణ, బియ్యం సరఫరాకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి రావల్సిన బకాయిలు వెంటనే విడుదల చేయాలని కేంద్ర ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రి శ్రీ ప్రహ్లాద్ జోషికి ముఖ్యమంత్రి శ్రీ ఏ.రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.
2014-15 ఖరీఫ్ కాలంలో అదనపు లెవీ సేకరణకు సంబంధించి రూ. 1468.94 కోట్ల రాయితీని పెండింగ్‌లో పెట్టారని కేంద్ర మంత్రికి వివరిస్తూ సంబంధిత పత్రాలన్నీ కేంద్రానికి సమర్పించిన విషయాన్ని తెలియజేశారు.
ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కింద 2021 మే నుంచి 2022 మార్చి వరకు సరఫరా చేసిన 89,987.730 మెట్రిక్ టన్నుల బియ్యానికి సంబంధించిన ఉత్తర్వులను ధ్రువీకరించుకొని అందుకు సంబంధించిన బకాయిలు రూ.343.27 కోట్లను విడుదల చేయాలని కేంద్ర మంత్రిని కోరారు.
అలాగే 2021 మే నుంచి 2022 మార్చి వరకు నాన్ ఎన్‌ఎఫ్‌ఎస్‌ఎ (నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్) కింద పంపిణీ చేసిన బియ్యానికి సంబంధించిన బకాయిలు రూ.79.09 కోట్లు వెంటనే విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఉప ముఖ్యమంత్రి శ్రీ భట్టి విక్రమార్క, రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి శ్రీ ఉత్తమ్ కుమార్‌రెడ్డి, రాష్ట్రానికి చెందిన పలువురు ప్రజా ప్రతినిధులతో కలిసి ముఖ్యమంత్రి కేంద్ర మంత్రిని కలిశారు. రాష్ట్రానికి బకాయిపడిన మొత్తాన్ని తక్షణం విడుదల చేయాలని కోరుతూ ఆ మేరకు వినతిపత్రాన్ని సమర్పించారు.