ఈ అధికారులు చేసిన పనికి అందరూ ఫిదా..?
భూమిని తీసుకొని తండ్రిని పట్టించుకోని ఓ కొడుకికి బుద్ది వచ్చేలా తిరిగి తండ్రి పేరు మీదికి భూమిని మార్చిన అధికారులపై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తుంది.. తెలంగాణలోని హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముస్తఫాపూర్ గ్రామానికి చెందిన మద్దెల రాజకొంరయ్య, మల్లమ్మ దంపతులకు ఒక కొడుకు, ఇద్దరు కూతుళ్లు.. అందరికీ పెళ్లిళ్లు చేశారు.
ఆరేళ్ల క్రితం మల్లమ్మ మృతి చెందగా, రాజకొంరయ్య ఒంటరిగా ఉంటున్నాడు.. అనంతరం రాజకొంరయ్య కొడుకు రవి తండ్రి పేరు మీదున్న 4.12 ఎకరాల భూమిని పట్టా చేసుకున్నాడు.అప్పటి నుండి తండ్రి బాగోగులు చూడడం మానేశాడు.. ఈ విషయంపై పెద్ద మనుషుల సమక్షంలో పంచాయితీలు పెట్టగా వారి ముందే తండ్రిని కొట్టాడు.
దీంతో మానసికంగా కుంగిపోయిన రాజకొంరయ్య, తన కుమారుడికి ఇచ్చిన భూమి పట్టాను రద్దు చేయాలని భీమదేవరపల్లి తహసీల్దార్, హనుమకొండ ఆర్డీవో, ముల్కనూర్ పోలీస్ స్టేషన్లో లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసి.. కొడుక్కి భయపడి కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం పెద్దపాపయ్యపల్లిలోని ఓ రైస్‌మిల్లులో నైట్ వాచ్‌మెన్‌గా పనిచేస్తున్నాడు.
విచారణ చేపట్టిన హనుమకొండ ఆర్డీవో, భీమదేవరపల్లి తహసీల్దార్.. సీనియర్ సిటిజన్ యాక్టు అమలు చేసి, రవికి రిజిస్ట్రేషన్ చేసిన 4.12 ఎకరాల్లో 3.20 ఎకరాలను రద్దు చేసి, తిరిగి ఆన్‌లైన్‌లో రాజకొంరయ్య పేరిట రిజిస్ట్రేషన్ చేశారు.
నా బాగోగులు నా పిల్లలు చూసుకోకపోతే భూమిని ఏదైనా అనాథ శరణాలయానికి రాసిస్తా. వృద్ధాప్యంలో తల్లిదండ్రుల బాగోగులు చూసే బాధ్యత కన్న కొడుకులపై ఉంటుంది. కానీ, నా బాగోగులు చూడకుండా, నాపై దాడి చేస్తున్నారు. 75 ఏళ్ల వయసులో రైస్‌మిల్లులో గుమస్తా, నైట్ వాచ్‌మెన్‌గా పనిచేయాల్సిన దుస్థితి నెలకొంది. నా పరిస్థితి ఏ తండ్రికీ రాకూడదంటూ రాజకొంరయ్య కన్నీళ్లు పెట్టుకున్నాడు.