బడ్జెట్ లో తెలంగాణకి తీవ్ర అన్యాయం

 బడ్జెట్ లో తెలంగాణకి తీవ్ర అన్యాయం

Loading

నాడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటునే అవమానించి నేడు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ఏమాత్రం సహకరించకుండా తెలంగాణపై సవతి తల్లీ ప్రేమ చూపిస్తున్న కేంద్ర ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారు మండిపడ్డారు..కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో తెలంగాణ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేసిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా ఏఐసిసి మరియు టిపీసిసి ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జనగామ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ కూడలి వద్ద ఏర్పాటు చేసిన నిరసన కార్యక్రమంలో జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి గారితో కలిసి ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్బంగా అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారు పూల మాలలు వేసి నివాళులు అర్పించి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

అనంతరం ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ తెలంగాణ ప్రజల పోరాటాలను గౌరవించి, అమరుల త్యాగాలను గుర్తించి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారు. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుండి నేటి వరకు కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో ఏనాడూ తెలంగాణ రాష్ట్రానికి అదనంగా ఒక్క రూపాయి కేటాయించలేదని దీనిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. ఆ సమయంలో మోడీ ప్రధానిగా ఉంటే తెలంగాణ రాష్ట్రం వచ్చేది కాదని అన్నారు. నరేంద్ర మోడీ, బీజేపీ పార్టీ మొదటి నుండి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అవమానించే విధంగా, అగౌరపరిచే విధంగా, ప్రజల ఆకాంక్షను అవమానించే విధంగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకే తెలంగాణకు ఏ రకంగా సహకరించడం లేదని ఆరోపించారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్వయంగా ప్రధాన మంత్రిని, కేంద్ర మంత్రులను కలిసి అనేక సార్లు ఎన్ని విజ్ఞప్తులు చేసినా పట్టించుకోవడంలేదని, విభజన హామీలను పరిష్కరించడం లేదని అన్నారు. బీజేపీ పార్టీ ఏ రాష్ట్రంలో ఆ రాష్ట్రానికి వేల కోట్ల నిధులు కేటాయించి రాజకీయంగా లబ్ది పొందే ప్రయత్నం చేస్తుందని విమర్శించారు. కేంద్రం అంటే అన్ని రాష్ట్రాల కలయిక అని, దేశంలోని అన్ని రాష్ట్రాలను సమానంగా చూడకుండా వివక్ష చూపడం దుర్మార్గమని మండిపడ్డారు. పక్కన ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అనేక విధాలా బడ్జెట్ కేటాయించిన బీజేపీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి ఎందుకు కేటాయించలేదని ప్రశ్నించారు.

తెలంగాణలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, స్టీల్ ఫ్యాక్టరీ, రీజినల్ రింగ్ రోడ్డు, సెంట్రల్ యూనివర్సిటీ, ట్రిపుల్ ఐటి వంటి అనేక విజ్ఞప్తులు చేసిన ఏ ఒక్కటీ పట్టించుకోవడం లేదని అన్నారు. తెలంగాణ రాష్ట్రం దేశంలో లేదా, తెలంగాణ ప్రజలు పన్నులు కట్టడం లేదా…. దేశంలోనే అత్యధిక జీడిపి, అత్యధిక జీఎస్టి అందిస్తున్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అని తెలిపారు. అయిన తెలంగాణ రాష్ట్రానికి మొండి చేయి చూపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ పట్ల కేంద్ర ప్రభుత్వ మొండి వైఖరిని ప్రజలకు తెలిపేందుకే ఈరోజు కాంగ్రెస్ పార్టీ రోడ్డు ఎక్కిందని అన్నారు.

తెలంగాణ బిజెపి ఎంపీలు నరేంద్ర మోడీకి గంగిరెద్దుల్లాగా తల ఊపడం తప్పితే తెలంగాణ రాష్ట్రానికి ఏం ఒరగబెట్టారని అన్నారు. తెలంగాణ నుండి ఉన్న ఇద్దరు కేంద్ర మంత్రులు చవటలు, దద్దమ్మలు అని విమర్శించారు. వీళ్ళు పేరుకే కేంద్రమంత్రులని, తెల్లారి లేస్తే ప్రెస్ మీట్ లు పెట్టి కాంగ్రెస్ పార్టీని, ప్రభుత్వాన్ని విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని ఆరోపించారు. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ గారికి తెలంగాణ పై ప్రేమ ఉంటే, తెలంగాణ అభివృద్ధిపై చిత్తశుద్ధి ఉంటే కేంద్రం నుండి ఎన్ని నిధులు తెచ్చారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. నిజంగా మీకు తెలంగాణ పౌరుషం ఉంటే తెలంగాణకు నిధులకు తీసుకురావాలి లేదంటే వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులోయ్ అని బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంభించిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ గారు తెలంగాణ రాష్ట్రం దేశంలో లేదా, తెలంగాణ తెలంగాణలో ఉన్నది మనుషులు కాదా అని ప్రశ్నించారు. కనీసం సర్పంచ్ కూడా కాకుండా దొడ్డి దారిన కేంద్ర ఆర్థిక మంత్రి అయితే క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితులు ఎలా తెలుస్తాయని దుయ్యబట్టారు. బిజెపి పార్టీ మొదటి నుండి తెలంగాణ పై వ్యతిరేకత చూపుతూ, రాజ్యాంగాన్ని, అంబేద్కర్ గారిని అవమానించే విధంగా వ్యవహరిస్తుందని అన్నారు. ఇలాంటి మతతత్వ పార్టీ నుండి దేశాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు. ఇప్పటికైనా తెలంగాణ బిజెపి ఎంపీలు నరేంద్ర మోడీ దగ్గర మోకరిల్లకుండా తెలంగాణ అభివృద్ధికి నిధులు తీసుకురావాలని లేకపోతే వెంటనే మీ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *