ప్రజా ప్రభుత్వం కాదు బుల్డోజర్ ప్రభుత్వం
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో హైడ్రా పేరిట నిరుపేదల ఇండ్లను కూలగొడుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కార్‌పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్.. మాజీ మంత్రి కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
హైడ్రా పేరుతో నగరంలో నివాసం ఉంటున్న నిరుపేదల ఇండ్ల మీదకు వెళ్లినట్లు.. మీ అన్న తిరుపతి రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇంటి మీదికి బుల్డోజర్‌ను పంపించే ధైర్యం మీకు ఉందా..? అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మాజీ మంత్రి కేటీఆర్ ఎక్స్ వేదికగా ప్రశ్నించారు.
ఉన్న ఒక గూటినీ మీ బుల్డోజర్ ప్రభుత్వం కూల్చివేస్తే, కడుపుమండి, కన్నీళ్ళతో కిరసనాయిలు పోసుకున్నందుకు కేసులు పెడతారా అంటూ కేటీఆర్ ప్రశ్నించారు. ఎంత సిగ్గుచేటు, ఎంతటి నీతిమాలిన చర్య, మీది ప్రజా ప్రభుత్వం, ప్రజా పాలన కాదు రేవంత్ రెడ్డి, మీరు నడుపుతున్నది బుల్డోజర్ ప్రభుత్వం! కేసుల రాజ్యమంటూ తీవ్ర స్థాయిలో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.