తెలంగాణ రైతాంగానికి శుభవార్త
తెలంగాణ వ్యాప్తంగా ఉన్న రైతులకు సంబంధించి రూ. 2 లక్షల మేరకు రుణమాఫీకి సంబంధించి విధి విధానాలతో అవసరమైన ప్రణాళికలు రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. రుణమాఫీ, ధాన్యం కొనుగోలు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై ఈరోజు అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.
రైతుల రుణమాఫీ కోసం అవసరమైతే ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయడంతో పాటు నిధులు ఇచ్చేందుకు ముందుకొచ్చే బ్యాంకర్లతో సంప్రదింపులు జరపాలని సూచించారు. ఈ విషయంలో మహారాష్ట్ర, రాజస్థాన్, ఇతర రాష్ట్రాల్లో అనుసరించిన విధానాలను అధ్యయనం చేయాలని చెప్పారు.
ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచాలని, దళారుల జోక్యం లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. రైతు నుంచి పంటను కొని మిల్లింగ్ చేసి రేషన్ షాపుల్లో సన్న బియ్యం అందించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
కల్లాల వద్ద రైతులు ఇబ్బందులు పడకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. అక్రమాలకు పాల్పడే రైస్ మిల్లర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ ఆదేశించారు.