తెలంగాణలో పోలీసు వ్యవస్థ ఉందా.?:
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై కాంగ్రెస్ కార్యకర్తల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ.. తెలంగాణలో గూండా రాజ్ తీసుకొచ్చింది. భౌతికదాడులతో ప్రతిపక్షాలను, ప్రశ్నించేవారిని అడ్డుకోవాలని చూస్తోంది. ఓ వైపు రాహుల్ గాంధీ.. మొహబ్బత్ కా దుకాణ్ అని దేశమంతా తిరుగుతున్నాడు. కానీ తెలంగాణలో మాత్రం గూండారాజ్, హత్యారాజ్ నడుస్తోంది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి, ప్రస్తుతం ఎమ్మెల్యే అయిన కేటీఆర్ గారిపైనే దాడి జరిగింది అంటే.. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. సోమవారం రోజు ఏకంగా తెలంగాణ భవన్ పైనే దాడికి ప్రయత్నించారు.
కొద్దిరోజుల క్రితం వరద బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన మాజీ మంత్రి హరీశ్ రావు గారిపై, మాజీ మంత్రులపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడిచేశారు. ఇవే కాదు.. చాలామంది బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై కాంగ్రెస్ పార్టీ గూండాలు దాడులు చేస్తున్నారు. ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి, మంత్రుల కనుసన్నల్లోనే జరుగుతున్నాయి.కాంగ్రెస్ పార్టీ తన తీరును మార్చుకోకపోతే.. ఇలాగే చిల్లర మల్లర ప్రయత్నాలు చేసి.. మా పార్టీ నాయకులపై, కార్యకర్తలపై దాడులకు తెగబడితే చూస్తూ ఊరుకోబోము. ఉద్యమం చేసి, ఆంధ్రా పాలకులతోని కొట్లాడిన యోధులు బీఆర్ఎస్ లో ఉన్నారు.
మేం తలుచుకుంటే కాంగ్రెస్ నాయకులను ఇళ్ల నుంచి బయటకు రాకుండా చేయగలం. కానీ మాకు ప్రజాస్వామ్యంపై నమ్మకం ఉంది. అందుకే మీ లాగా హింసా మార్గాన్ని ఎంచుకోలేదు. మా సహనాన్ని చేతగానితనంగా భావిస్తే.. కాంగ్రెస్ పార్టీ అంతకంతకు అనుభవించక తప్పదు. ఈ విషయాన్ని రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకోవాలి.ఇలా దాడులు చేసిన వారిని వదిలిపెట్టి బీఆర్ఎస్ నాయకులపై, కార్యకర్తలపై కేసులు పెడుతున్న పోలీసుశాఖ ఓ సారి ఆత్మపరిశీలన చేసుకోవాలి. ప్రధాన ప్రతిపక్ష పార్టీ కార్యాలయం మీదికి అధికార పార్టీ కార్యకర్తలు దాడి చేయడానికి వస్తే ఆపకుండా పోలీసులు ఏం చేశారో… డీజీపీ సమాధానం చెప్పాలి. బాధితులకు రక్షణ కల్పించకుండా.. నిందితులకు రక్షణ కల్పిస్తూ.. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ని మంటగలుపుతున్నారు. తెలంగాణ పోలీసులకు గతంలో ఉన్న మంచిపేరును చెడగొడుతున్నారు. ఇదంతా చూస్తోంటే అసలు రాష్ట్రంలో పోలీసుశాఖ, డీజీపీ, పోలీసులు ఉన్నారా.? అనే అనుమానాలు కలుగుతున్నాయి అని మీడియాకు విడుదల చేసిన ఓ ప్రకటనలో వై.సతీష్ రెడ్డి( బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్) పేర్కొన్నారు..