కాంతారా 2 రిలీజ్ అయ్యేది అప్పుడే..?
కన్నడ స్టార్ రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో నటించిన సినిమా ‘కాంతార’. తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమా ఏ స్థాయి విజయాన్ని సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చిన్న సినిమాగా వచ్చిన ‘కాంతార’ సినిమా బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ.400 కోట్లను వసూళ్లు చేసి ఔరా అనిపించింది. కొన్ని పదుల రెట్ల లాభాలను నిర్మాతలకు తెచ్చి పెట్టిన కాంతార సినిమాకు సీక్వెల్ రావాలని అభిమానులు కోరుతున్నారు.
అంతా కోరుకున్నట్లుగానే కాంతార 2 రాబోతున్న సంగతి తెలిసిందే. కాంతార లో చూపించిన కథకు ముందు జరిగే కథతో కాంతార : చాప్టర్ 1 టైటిల్‌తో ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. ‘కాంతార’ను లో బడ్జెట్ మూవీగా తీసుకు వచ్చిన రిషబ్ శెట్టి ఈసారి వంద కోట్లకు మించిన బడ్జెట్‌తో తెరకెక్కిస్తారు. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే శరవేగంగా కొనసాగుతోంది.
2025లో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తామని గతంలోనే రిషబ్ శెట్టి ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ విషయమై మరింత స్పష్టత ఇచ్చింది చిత్రయూనిట్. అక్టోబర్ 2, 2025న గాంధీ జయంతి సందర్భంగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటన చేస్తూ ఒక పోస్టర్‌ను విడుదల చేసింది చిత్ర బృందం. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ సినిమా విడుదల తేదీ రావడంతో అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు