ఫార్ములా ఈ” రేసు “లో గెలిచింది కేటీఆరా.?. రేవంతా..?
ఫార్ములా ఈ రేసు కారు వివాదం ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర రాజకీయాలతో పాటు యావత్తు దేశ రాజకీయాలనే తమవైపు తిప్పుకున్న హాట్ టాఫిక్. ప్రస్తుతం ఈ కేసు ఏసీబీ విచారణలో ఉంది కాబట్టి కాసేపు ఆ అంశాన్ని పక్కనెడదాము. అసలు ఈ వివాదంలో పైచేయి ఎవరిది మాజీ మంత్రి కేటీఆర్ దా..?. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిదా..?. ఇప్పుడు చూద్దాము.
ఈ అంశం తెరపైకి వచ్చిన దగ్గర నుండి ముఖ్యమంత్రి దగ్గర నుండి అధికార పార్టీ నేతలందరూ ముక్తకంఠంగా చెప్పేది కేటీఆర్ జైలుకెళ్లడం ఖాయం అని. కేటీఆర్ జైలుకెళ్తాడా..?. నిర్దోషిగా బయటపడతాడా న్యాయస్థానాలు తేలుస్తాయి. మరి ఏసీబీ విచారణకు నాతో పాటు న్యాయవాది వస్తాడని కేటీఆర్. లేదు మీరొక్కరే రావాలని సంబంధితాధికారులు. శివుడు అజ్ఞ లేనిదే చీమ అయిన కుట్టదన్నట్లు పైనుండి ఆదేశాల్లేకుండానే న్యాయవాది లేకుండా విచారణకు రావాలని అధికారులు పట్టుబట్టరని చరిత్ర చెబుతున్న పాఠం. మరి ఈ అంశంలో గెలిచిందేవరూ.?
నేను ఏసీబీ కాదు ఈడీ కాదు సీబీఐ విచారణకైన వస్తాను . కాకపోతే నాతో పాటు నా న్యాయవాది వస్తాడని హైకోర్టునశ్రయించాడు కేటీఆర్. దాదాపు మూడు నుండి ఐదారు గంటలు ఇరువైపులా వాదనలు విన్న హైకోర్టు ధర్మాసనం చివరికి న్యాయవాదిని అనుమతిస్తూ కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చింది. అంటే మొదటి నుండి న్యాయవాది లేకుండా విచారణకు రావాలని అధికారులు పట్టుబట్టిన. అధికార పార్టీ కుట్రలు చేసిన(బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నట్లుగా) అవన్నీ తోసిరాజని హైకోర్టు ఆదేశాలతో రేపు కేటీఆర్ ఏసీబీ విచారణకు హాజరవుతున్నారు. అంటే ఈ అంశంలో కేటీఆర్ దే గెలుపు అని బీఆర్ఎస్ శ్రేణులు సంబురపడుతున్నారు.
ఈ కేసు లొట్టపీస్ కేసు కాబట్టి తను ఎలాంటి తప్పు చేయలేదు. ఎలాంటి అవినీతి జరగలేదు నేను కడిగిన ముత్యంలా బయటకు వస్తానని కేటీఆర్ ప్రగల్భాలు పలుకుతున్నారు. లేదు కేటీఆర్ అవినీతి చేశాడు కుంభకోణం జరిగిందని అధికార పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. చివరికి ఈ అంశంలో ఎవరిని విజేతలుగా న్యాయస్థానం తేలుస్తుందో మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే మరి.