పట్టు పరిశ్రమకు పునరుజ్జీవానికి చర్యలు – మంత్రి తుమ్మల
పట్టు పరిశ్రమలో తక్కువ పెట్టుబడితో అధిక రాబడి ఉండి, గ్రామీణ పేదలు అనుకూలంగా స్థిరమైన వ్యవసాయ ఆధారిత పరిశ్రమగా ఉంటుందని వ్యవసాయశాఖ మంత్రి శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారు తెలియజేశారు. పట్టు పరిశ్రమశాఖ అధికారులతో మాట్లాడుతూ ఆ శాఖ అభివృద్ది కొరకు కొన్ని ముఖ్యమైన సూచనలు చేశారు.
రాష్ట్రంలో నేలలు మరియు వాతావరణం పట్టు పరిశ్రమకు అనుకూలం ఉంటాయని, పట్టు పరిశ్రమను మరింత ప్రోత్సహించే దిశగా ప్రణాళికలు తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. రైతులు (2) ఎకరాలలో మల్బరి మొక్కలను నాటి 4 నుండి 5 మందికి ఉపాధి కల్పించడమే కాకుండా సంవవత్సరానికి సగటున 2 నుండి 3 లక్షల స్థిరమైన ఆదాయం పొందే అవకాశముందని అన్నారు. పట్టు పరిశ్రమ అభివృద్ది కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ రాయితీలు ప్రకటిస్తున్నందున రైతులు పంట మార్పిడిలో భాగంగా మల్బరి తోటల పెంపకం మరియు పట్టు పురుగుల పెంపకం చేపట్టనట్లయితే గ్రామీణ పేదల జీవన ప్రమాణాలు మెరుగుపరుచుకోవచ్చని తెలిపారు.
సమగ్ర సిల్క్ పథకం నిధులను సధ్వినియోగం చేసుకొని అన్నీ జిల్లాలలో పట్టు పరిశ్రమ విస్తరించడానికి తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. నాణ్యమైన చాకీ పురుగులను రైతులకు అందించడానికి అవసరమైన చాకీ పెంపకం కేంద్రాలను మరిన్ని ఏర్పాటు చేయవలసిందిగా, రైతులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా సరఫరాను పర్యవేక్షించాలని ఆదేశించారు. ఈ మధ్య రైతులు ఎదుర్కొంటున్న ముఖ్యమైన “నోన్-స్పిన్నింగ్” (గూడు అల్లుకోక పోవడం) సమస్య నుండి రైతులను ఆదుకొనే విధంగా కేంద్ర పట్టు మండలి (CSB) శాస్త్రవేత్తలతో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలను ఏర్పాటు చేయాలన్నారు.
అంతేకాకుండా రాష్ట్రం లో ఉన్న ఆటో మేటిక్ రీలింగ్ యూనిట్లకు సరిపడే నాణ్యమైన పట్టు గూళ్ళ ఉత్పత్తికి అవసరమైన సాంకేతిక సలహాలను జిల్లాల వారీగా రైతుసదస్సులు ఏర్పాటు చేసి రైతు రాబడిని పెంచాలని సూచించారు.రాష్ట్రానికి తలమానికమైన పోచంపల్లి ఇక్కత్, గద్వాల, నారాయణపేట చీరలకు అవసరమైన ముడి సరుకులను తెలంగాణలోనే ఉత్పత్తి చేయడానికి అవసరమైన రీలింగ్ పరిశ్రమని ప్రోత్సాహానికి చర్యలు తీసుకోవలసిందిగా ఆదేశించారు. తద్వారా ఎంతోమందికి ఉపాధి కల్పించవచ్చని అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ విత్తన క్షేత్రములలో (Governement Seed Farms) నాణ్యమైన మల్బరీ మొక్కలను ఉత్పత్తి చేసి, రైతులకు సరఫరా చేయడం ద్వారా మంచి నాణ్యమైన పట్టు గూళ్ళు దిగుబడి వచ్చి రైతు ఆదాయం పెరుగుతుందని, ఈ విషయంలో తగిన ప్రణాళికలతో ముందుకు వెళ్లాలని సూచించారు.
దసలి (Tusar) పరిశ్రమ ఎంతో మంది భూమి లేని పేద గిరిజన, హరిజన రైతులకు మారుమూల అటవీ ప్రాంతంలో ఉపాధి కల్పిస్తునందున దీని అభివృద్ధికి అవసరమైన నిధులు మంజూరు చేస్తున్నామని, వీటిని సమర్ధంగా వినియోగించే విధంగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అదేవిధంగా దసలి పట్టు దారం ఉత్పత్తిలో కొత్త రకం యంత్ర పరికరాలను అందించి నాణ్యత కలిగిన టస్సార్ బట్టను ఉత్పత్తి చేసి ఈ పరిశ్రమపై ఆధారపడే నేత కార్మికులకు సహకరించాలని సూచించారు.
టస్సర్ పట్టుగుడ్ల ఉత్పత్తిలో సెంట్రల్ సిల్క్ బోర్డుపైనే ఆధారపడకుండా రాష్ట్ర ప్రభుత్వం కూడ గుడ్లు ఉత్పత్తి చేసి 2025-26 సంవత్సరానికి కొరత రాకుండా దశల వారీగా రైతులందరికి అందించాలని ఆదేశించారు. టస్సర్ పరిశ్రమపై ఎకువ దృష్టి ఉంచి గుడ్ల ఉత్పత్తి నుండి నాణ్యమైన వస్త్రాల ఉత్పత్తి వరకు అన్ని విధాలుగా రైతులకు తగిన సాంకేతికతను ఎప్పటికప్పుడు అందచేయాలని, తద్వారా భూమి లేని పేద గిరిజనుల ఆర్ధిక స్థితి మెరుగు పడుతుందని ఆభిప్రాయపడ్డారు.
పట్టు పరిశ్రమశాఖకు గత (10) సంవత్సరాలుగా రాష్ట్ర వాటా నిధులు కేటాయింపబడలేదు. తెలంగాణ రాష్ట్ర అవతరణ తరువాత ఈ రంగం తీవ్ర నిర్లక్ష్యానికి గురికాబడింది. ఈ రంగంలో రైతులకు / పేదల అభ్యున్నతికి అవకాశాలు ఉన్నప్పటికి ప్రోత్సహం అందించలేదు. పట్టు పరిశ్రమ రీలింగ్ మరియు ట్విస్టింగ్ (పురిధారము) పరిశ్రమలను ప్రోత్సహించినట్లయితే ఎంతో మందికీ ఉపాధి కల్పించవచ్చని గుర్తించి, కాంగ్రెస్ ప్రభుత్వము ఏర్పడిన వెంటనే 2024-25 సం.కు గాను 1608.40 లక్షల మ్యాచింగ్ స్టేట్ వాటాను కేటాయించి ఈ పరిశ్రమ అభివృద్ధికి దోహదపడుతున్నదని మంత్రిగారు తెలిపారు. అంతేకాకుండా పట్టుగూళ్ళు ఉత్పత్తి చేసిన రైతులకు మద్ధతుగా కిలో ఒకంటికి రూ. 75/- ను ఈ ప్రభుత్వము మంజూరు చేస్తున్నదని మంత్రిగారు తెలిపారు.