చైనా వైరస్ ఎవరికి..ఎలా వస్తుంది..?

 చైనా వైరస్ ఎవరికి..ఎలా వస్తుంది..?

చైనాలో వేగంగా వ్యాపిస్తున్న HMPV కేసులు భారత్లోనూ బయటపడుతున్నాయి. బెంగళూరులో ఇద్దరు చిన్నారులకు, గుజరాత్ లోని ఓ చిన్నారికి, కోల్కతాలో 5 నెలల చిన్నారికి, తమిళనాడులో ఇద్దరకి పాజిటివ్ గా తేలింది.

వీరి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని కేంద్రం పేర్కొంది. వీరికి అంతర్జాతీయ ప్రయాణాలు చేసిన హిస్టరీ లేకుండా వైరస్ వ్యాపించడం కలవరపెడుతోంది.అసలు ఇది ఎక్కడ పుట్టింది. ఎవరికి ఎలా వస్తుందో ఇప్పుడు తెలుసుకుందాము.

హెచ్ఎంపీవీ వైరస్ :-

2001లో తొలిసారిగా హ్యూమన్ మెటాన్యూమోవైరస్ ను(HMPV) గుర్తించారు. 2011-12లో అమెరికా, కెనడా, ఐరోపాలో ఈ వైరస్ కేసులు నమోదైనట్లు WHO వద్ద సమాచారం ఉంది.

వైరస్ లక్షణాలు:-

కరోనా, ఫ్లూ, ఇతర శ్వాసకోశ వ్యాధులకు ఉండే లక్షణాలే హ్యూమన్ మెటాన్యూమోవైరస్లో కనిపిస్తున్నాయి.

  • తీవ్రమైన జలుబు, ముక్కు కారడం, దగ్గు, జ్వరం, గొంతు నొప్పి వంటి లక్షణాలు రోగుల్లో కనిపిస్తాయి.

*లక్షణాలు తీవ్రంగా మారితే శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. కొన్నిసార్లు ఇది నిమోనియాకు దారితీసే ముప్పు ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. నిమోనియా, ఆస్తమా లక్షణాలు ఉన్నవారికి ఈ వైరస్ సోకితే వాటి ప్రమాదం మరింత పెరుగుతుంది.

సాధారణంగా వైరస్ సోకిన మూడు నుంచి ఆరు రోజుల్లో వ్యాధి లక్షణాలు కనిపిస్తాయి.

ఎలా వ్యాప్తి చెందుతుంది?:-

గతంలో కరోనా వ్యాప్తి చెందిన మాదిరిగానే ఈ వైరస్ కూడా దగ్గు, తుమ్ముల నుంచి వచ్చే తుంపర్ల ద్వారా ఇతరులకు వ్యాపిస్తున్నట్లు గుర్తించారు.

  • వైరస్ సోకిన వ్యక్తికి షేక్ హ్యాండ్ ఇచ్చినా, తాకినా వైరస్ సోకే అవకాశం ఉంది.
  • వైరస్ వ్యాపించి ఉన్న ప్రాంతాల్లో వస్తువులను తాకి, అవే చేతులతో ముక్కు, నోరు, కళ్లను తాకినా వైరస్ సోకుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

ఎవరికి ముప్పు ఎక్కువ?:-

వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు, వృద్ధులు, ఐదేళ్లలోపు చిన్నారుల్లో ఎక్కువ మంది ఈ వైరస్ బారిన పడుతున్నట్లు వైద్యులు తెలిపారు.

ఈ జాగ్రత్తలు తీసుకోవాలి:-

  • వైరస్ లక్షణాలు ఉంటే ఇతరకు వ్యాప్తి చెందకుండా తప్పనిసరిగా మాస్క్ ధరించాలి.
  • దగ్గేటప్పుడు, తుమ్మేటప్పుడు ముక్కు, నోరుకు టిష్యూ లేదా కర్చీఫ్ ను అడ్డుపెట్టుకోవాలి.

వైరస్ వ్యాప్తి చెందకుండా సబ్బుతో చేతులను శుభ్రం చేసుకోవాలి. శుభ్రం చేసుకున్న చేతులతో ముఖాన్ని ఎక్కువసార్లు ముట్టుకోవద్దు.

వైరస్ లక్షణాలు ఉన్నవారికి కాస్త దూరంగా ఉండటం మంచిది. అలాగే ఈ వైరస్ లక్షణాలు ఉన్న వ్యక్తులు కూడా తాము వాడిన వస్తువులను ఇతరులు వాడకుండా చూసుకోవాలి.

  • లక్షణాలు ఎక్కువగా ఉంటే ఇంట్లోనే ఉండి డాక్టరు సలహాలను పాటించాలి. అత్యవసరమైతే డాక్టరు సూచనలతో ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకోవాలి.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *