రైతులు పండించిన పంటను తక్షణమే కొనాలి

 రైతులు పండించిన పంటను తక్షణమే కొనాలి

తెలంగాణ రాష్ట్రంలోనిసిద్దిపేట జిల్లా చిన్నకోడూరులోని వడ్ల కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు మీడియాతో మాట్లాడుతూ:

తుఫాన్ ప్రభావంతో వచ్చే మూడు రోజులు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తున్నా ప్రభుత్వం మాత్రం రోజుల తరబడి వడ్లు కొనకపోవడం వల్ల వడ్లు తడిచే అవకాశం ఉంది.

ఆరుగాలం కష్టపడి పంట పండించిన రైతులు కల్లాల్లో పడిగాపులు కావలసిన పరిస్థితి ఏర్పడింది.

తడిసిన వడ్లతో సహా అన్ని వడ్లను కొంటున్నామని ప్రభుత్వం చెబుతున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితి వేరేలా ఉంది. చిన్నకోడూరు కేంద్రాల్లో రైతులు 20 రోజులుగా వేచి చూస్తున్నారు.

ధాన్యం ఒకటికి రెండుసార్లు తడిసి మొలకెత్తింది. ధాన్యం రైస్ మిల్లుకు వెళ్లాక తేమ శాతం ఎక్కువ ఉందని, మొలకెత్తిందని కొనడం లేదు. కొన్నా తరుగు తీసేయడం వల్ల సంచికి మూడు కిలోలు కోతపెట్టే పరిస్థితి ఏర్పడుతుంది.

తరుగు లేకుండా వెంటనే వడ్లు కొనాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.తడిచిన, మొలకెత్తిన వడ్లను కూడా కొనాలి.

40% ధాన్యం ఇంకా కొనుగోలు కేంద్రాల్లోనే ఉంది. లారీల సంఖ్య పెంచి ధాన్యాన్ని కొనాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం.

చిన్నకోడూరు రైతులతో మాట్లాడినప్పుడు ఇంటి అవసరాలకు మాత్రమే సన్నవడ్లు పండిస్తామని, పండించే మిగతా వడ్లన్నీ దొడ్డువడ్లేనని చెబుతున్నారు.

అసెంబ్లీ ఎన్నికలప్పుడు కాంగ్రెస్ అన్ని పంటలకు 500 బోనస్ ఇస్తామని చెప్పి, ఇప్పుడు కేవలం సన్నవడ్లకే ఇస్తామనడం రైతులను మోసం చేయడమే.

పెట్టుబడి ఎక్కువ దిగుబడి తక్కువైన సన్నరకాన్ని సాధారణంగా రైతులు సాగు చేయరు.

సిద్దిపేట జిల్లాలో 3,38,389 ఎకరాల్లో వరి సాగయింది. 3 లక్షల 29 వేల ఎకరాల్లో దొడ్డు రకం వేశారు. 16 వేల ఎకరాల్లో మాత్రమే సన్నరకం వేశారు.

రూపాయికి 95 శాతం దొడ్డువడ్లు పండించే వాళ్లకు బోనస్ ఎగ్గొట్టి , కేవలం ఐదు శాతం సన్నబడ్లు పండించే వాళ్లకు బోనస్ ఇస్తామనడం రైతులను దగా చేయడమే.

వరిధాన్యానికి బోనస్ అని హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కుట్రతో ఎగ్గొట్టింది.

ఎకరానికి 7500 రైతు భరోసా ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవసాయ పనులు మొదలుకాకముందే జూన్ లోనే ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం.

ఆగ్రో సేవా కేంద్రాల్లో పచ్చి రొట్టె విత్తనాలు ఇవ్వడం లేదు. విత్తానాల కోసం రైతుల పాస్ పుస్తకాలు లైన్లో పెట్టి వేచి చూసే పరిస్థితి ఏర్పడింది.

రాష్ట్రంలో ఎక్కడ కూడా పచ్చి రొట్టె విత్తనాలు అందుబాటులో లేక రైతులు ఇబ్బంది పడుతున్నారు.

బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మంత్రులు కల్లాల్లో తిరిగేవాళ్లు. ఇప్పుడు ఒక్క మంత్రి కూడా ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించడం లేదు.

క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందన్న విషయం తెలుసుకోవడానికి మంత్రులు కొనుగోలు కేంద్రాలను సందర్శించాలి అని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *