మంత్రి సీతక్క పరామర్శ
బౌరంపేటలో లైంగిక దాడికి గురై హైదర్ నగర్ లోని రెయిన్బో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నాలుగు సంవత్సరాల చిన్నారిని పంచాయతీ రాజ్ గ్రామీణ అభివృద్ధి మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి సీతక్క పరామర్శించారు. చిన్నారి ఆరోగ్య పరిస్థితిని, అందుతున్న వైద్యాన్ని డాక్టర్ల నుంచి అడిగి తెలుసుకున్నారు.
మహిళా అభివృద్ధి సహకార కార్పొరేషన్ చైర్ పర్సన్ బండ్లు శోభారాణి, మహిళా శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ కాంతి వెస్లీ తో కలిసి చిన్నారిని, కుటుంబాన్ని మంత్రి సీతక్క పరామర్శించారు. ప్రభుత్వం అన్ని రకాల అండగా ఉంటుందని భరోసా కల్పించారు. పాప పూర్తిగా కోలుకున్న తర్వాతే డిశ్చార్జ్ చేయాలని మంత్రి సీతక్క డాక్టర్లకు సూచించారు. చిన్నారి వైద్య చికిత్సకి అవసరమైన ఖర్చు మొత్తం ప్రభుత్వం భరిస్తుందని తెలిపారు.
పాప పూర్తిగా కోలుకునేంతవరకు దగ్గర ఉండి అన్ని రకాలుగా అండగా నిలవాలని కాంతి వెస్లీని ఆదేశించారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వ అండగా ఉంటుందని సీతక్క వెల్లడించారు. తక్షణ అవసరాల నిమిత్తం బాధిత కుటుంబానికి 50 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన మంత్రి సీతక్క ఘటన పట్ల విచారం వ్యక్తం చేశారు. పాప తండ్రి మిత్రుడే కిరాతకానికి పాల్పడడం దారుణం అన్నారు. ఘటన వెలుగు చూసిన వెంటనే నిందితుడిపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్లు తెలిపారు. ఈ ఘాతుకానికి పాల్పడిన నిందితుడి కి కఠిన శిక్ష పడేలా చేస్తామన్నారు.