పవన్ కళ్యాణ్ పదవికి గండం..!

ఉప ముఖ్యమంత్రి… జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోస్ట్ కు ఎసరు వచ్చిందా..?. త్వరలోనే డిప్యూటీ సీఎం కి ఇంకో డిప్యూటీ సీఎం జతకానున్నాడా..?. అంటే అవుననే అంటున్నారు ఇటు బాబు ఆస్థాన మీడియా కవి.. అటు తెలుగు తమ్ముళ్ళు. గత వారంలో వీకెండ్ విత్ ఆర్కే లో పవన్ కళ్యాణ్ అందరితో పాటే ఓ మంత్రి.. రాజ్యాంగ పరంగా చూస్తే ఓ మంత్రికి ఉన్న అధికారాలే తప్పా ముఖ్యమంత్రితో పాటు సమానంగా ఉండవు. ఇప్పటికైన పవన్ హద్దుల్లో ఉంటే సరిపోతుంది. లేకపోతే భవిష్యత్తులో పవన్ కు తిప్పలు తప్పవు అని ఓ ఆర్ధగంట స్టోరీ నడిపించాడు. ఆ తర్వాత తెలుగు తమ్ముళ్లు వంతుపాడుతూ ఒకరి తర్వాత ఒకరు టీడీపీ జాతీయ కార్యదర్శి.. మంత్రి అయిన నారా లోకేష్ నాయుడు గత ఎన్నికల్లో చాలా కష్టపడ్డాడు.
చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా మంగళగిరిలో టీడీపీ జెండా ఎగిరేవిధంగా విజయాన్ని సాధించాడు. భవిష్యత్తు ఆశాకిరణం. యువతకు బలమైన నారా లోకేశ్ నాయుడుని ఉప ముఖ్యమంత్రి చేయాలని ముందుగా ఆ పార్టీకి చెందిన రాజేష్ మహాసేన అన్నారు. ఆ తర్వాత కడప జిల్లాలో జరిగిన ఓ కార్యక్రమంలో సాక్షాత్తు ఓ ముఖ్యనేత పొలిట్ బ్యూరో సభ్యుడు ఆర్. శ్రీనివాసులు రెడ్డి అనే నాయకుడు అన్నారు. ఆ తర్వాత ఏకంగా అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్, ఉండి అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణ రాజు కూడా మంత్రిగా ఉన్న లోకేశ్‌ను డిప్యూటీ సీఎంను చేయాలని తన మనసులో మాట వెల్లడించారు. తాజాగా టీడీపీకి చెందిన సీనియర్ నేత.. మాజీ మంత్రి.. సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కూడా లోకేశ్ ను ఉప ముఖ్యమంత్రిని చేయాల్సిందే అని తన అభిప్రాయాన్ని ట్విట్టర్ లో వెల్లడించారు.
ట్విట్టర్ లో సోమిరెడ్డి “ఉప-ముఖ్యమంత్రి పదవికి లోకేశ్ బాబు అన్ని విధాలా అర్హులే.. లోకేశ్‌ను డిప్యూటీ సీఎం చేయాలన్న పొలిట్ బ్యూరో సభ్యుడు ఆర్. శ్రీనివాసులు రెడ్డి ప్రతిపాదనను నేను సమర్థిస్తున్నాను.. ఆ పదవికి లోకేష్ వందశాతం అర్హులే.. రాజకీయంగా అనేక సవాళ్లు, అవమానాలు ఎదుర్కొన్న తర్వాత యువగళం పాదయాత్రతో తనలోని నాయకత్వ లక్షణాలను లోకేశ్ నిరూపించుకున్నారు… లోకేశ్ పోరాటపటిమను చూసి టీడీపీ కేడర్‌తో పాటు రాష్ట్ర ప్రజానీకం కూడా అండగా నిలిచి ఆయన నాయకత్వాన్ని జైకొట్టింది.. డిప్యూటీ సీఎం పదవికి అన్ని విధాలా అర్హుడైన లోకేశ్ పేరును ఈ పదవికి పరిశీలించాలని టీడీపీ అధిష్ఠానాన్ని కోరుతున్నాను’’ అనిఎక్స్‌లో పోస్ట్ పెట్టారు.
బాబు తన రాజకీయ జీవితంలో ఏదైన పని అనుకుంటే ఆ పని పూర్తవ్వడానికి ముందుగా ఆ పనికి అంతరాయంగా ఉన్న వాటిని ముందు తన ఆస్థాన మీడియా ద్వారా తర్వాత తన అనుచరుల ద్వారా పలికిస్తారు. ఆ తర్వాత ఆ పనిని పూర్తి చేస్తారని వినికిడి. దానికి తగ్గట్లే ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ ను తప్పించాలంటే అతడ్ని ముందు ఆవేశపరుడు.. లిమిట్స్ దాటుతున్నాడు. అందుకే తప్పించి తన తనయుడ్ని ఉప ముఖ్యమంత్రిని చేస్తున్నాము అని సంకేతాన్ని ప్రజల్లోకివ్వడానికే ఇలా ప్లాన్ చేస్తున్నాడని ఇటు జనసైనికులు.. అటు రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఎందుకంటే జనసేన మద్ధతు లేకుండానే మెజార్టీ స్థానాలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవకాశాలు బాబుకు మెండుగా ఉన్నాయి. కాబట్టి చూడాలి మరి పవన్ పోస్ట్ ఉంటుందో.. ఊడుతుందో..?
