పురంధేశ్వరిది బావా’తీతమైన ఆవేదన
ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురంధేశ్వరిపై వైసీపీ మహిళ నాయకురాలు…. మాజీ మంత్రి రోజా మండిపడ్డారు. తిరుమల శ్రీవారి లడ్డూ విషయంలో ఏం జరిగిందో అదే ఏపీ సీఎం చంద్రబాబు మాట్లాడారు.. సీఎం వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు కామెంట్ చేయడం సమంజసంగా లేదని పురందేశ్వరి చేసిన వ్యాఖ్యలపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. బావ కళ్లలో ఆనందం చూడటం కాదు.. భక్తుల కళ్లలో ఆనందం చూడండి అని మాజీ మంత్రి రోజా హితవు పలికారు.
సుప్రీం వ్యాఖ్యలను పురంధేశ్వరి తప్పుదోవ పట్టించారని విమర్శించారు.పురంధేశ్వరి కనీస ఇంగితజ్ఞానం లేకుండా అత్యున్నత న్యాయస్థానాన్ని, న్యాయమూర్తులను అగౌరవపరుస్తూ, కించపరిచే విధంగా వారి వ్యాఖ్యలను తిరుమల లడ్డుప్రసాదాల విషయంలో తప్పుపడుతూ వారి ప్రతిష్టకు భంగం కలిగించడం రాజ్యాంగ విరుద్ధమని.. కోర్టు ధిక్కారమని అన్నారు. పురంధేశ్వరిపై చట్టరీత్య చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
పురంధేశ్వరి మొత్తం మీద సుప్రీంకోర్టుదే తప్పు అని తేల్చేసిందని అన్నారు. ‘ చంద్రబాబు రాజ్యాంగ పదవిలో ఉన్నాడు కాబట్టి చంద్రబాబు ఏదైనా అనొచ్చంట. ఏమమ్మా! మరి న్యాయవ్యవస్థ రాజ్యాంగ వ్యవస్థే కదా! తమరికి తెలియదా? అంత చిన్న విషయానికే న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేస్తారా అని చిరాకు పడిపోయారు పురంధేశ్వరి. ఆమెది బావా’తీతమైన ఆవేదన అనుకోవాలి మరి!’ అంటూ ఎద్దేవా చేశారు.