అసెంబ్లీలో సీఎం రేవంత్‌రెడ్డి ఒంటరి పోరాటం…?
అసెంబ్లీ లాబీల్లో జరుగుతున్న చర్చేంటి? సీనియర్ నేతలు సైతం అసెంబ్లీలో ప్రతిపక్షాన్ని ఎదుర్కోవడంలో ఎందుకు పెద్దగా ఆసక్తి చూపడం లేదు?.తమ లీడర్ ఫైర్ బ్రాండ్… ఒంటి చేత్తో పార్టీని అధికారంలోకి తెచ్చారు.. పదేళ్ల నిరీక్షణకు తెరదించారు. ఒక్కరే సాధించారు.. ఆ ఒక్కరు మాట్లాడితే చాలు.. ప్రతిపక్షం కూడా గప్‌చుప్ అయిపోవాల్సిందేనంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రులు భావిస్తున్నారా? సీఎం రేవంత్‌రెడ్డిపై ప్రతిపక్షాలు అటాక్ చేస్తుంటే… కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు కౌంటర్ అటాక్ చేయడంలో విఫలమవుతున్నారా..?.
అందుకే అసెంబ్లీలో పదేపదే సీఎం రేవంత్‌రెడ్డి స్వయంగా రంగంలోకి దిగాల్సివస్తుందా? అసెంబ్లీ లాబీల్లో జరుగుతున్న చర్చేంటి? సీనియర్ నేతలు సైతం అసెంబ్లీలో ప్రతిపక్షాన్ని ఎదుర్కోవడంలో ఎందుకు పెద్దగా ఆసక్తి చూపడం లేదు? అన్నింటికీ సీఎం రేవంత్‌రెడ్డి ఒక్కరే సరిపోతారని భావిస్తున్నారా..? 65 మంది ఎమ్మెల్యేలు.. కారు దిగేసి కొత్తగా జతకట్టిన ఎమ్మెల్యేలు మరో 10 మంది… ఇందులో సీఎం రేవంత్‌రెడ్డి కాకుండా 11 మంది మంత్రులు… అదనంగా నలుగురు విప్‌లు… శాసనసభలో పూర్తి ఆధిపత్యం.
ఇంత బలం బలగం ఉన్నా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఒక్కరే ఒంటరి పోరాటం చేస్తున్నట్లు కనిపిస్తోందా? నిజమే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు గమనిస్తే… ప్రతిపక్షం దాడిని ఎదుర్కోవడంలో కాంగ్రెస్‌లో స్పష్టమైన వైఫల్యం కనిపిస్తోందంటున్నారు పరిశీలకులు. అసెంబ్లీ లాబీల్లోనూ ఇదేవిధమైన చర్చ జరుగుతుండటం తెలంగాణ కాంగ్రెస్‌లో ఉదాసీన వైఖరిని బయటపెడుతోందంటున్నారు.సీఎం రేవంత్‌రెడ్డి కూడా ఇటీవల సచివాలయంలో కొందరు మంత్రులకు క్లాసు పీకినా…. పెద్దగా ఫలితం కనిపించడం లేదంటున్నారు. ప్రతి చిన్నవిషయానికి తానే స్పందించాల్సివస్తోందని.. మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా బాధ్యత తీసుకోవాలని గతంలో సీఎం చెప్పినా… ఎమ్మెల్యేలు, మంత్రులు ఎవరూ సీఎం వార్నింగ్‌ను సీరియస్‌గా తీసుకోలేదని అసెంబ్లీ సమావేశాల్లో మరోసారి తేలిపోయిందంటున్నారు.
ముసిముసిగా నవ్వుకుంటున్నారా?
బడ్జెట్ సమావేశాల్లో బీఆర్ఎస్ కీలక నేతలు కేటీఆర్, హరీశ్‌రావు, బీజేపీఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డితో పాటు…చివరకు కొత్తగా సభలో అడుగుపెట్టిన కౌశిక్ రెడ్డిలాంటి ఎమ్మెల్యేలు సైతం…. సీఎం రేవంత్‌రెడ్డిని టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తుంటే.. అధికార పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు స్పందించాల్సిన రీతిలో స్పందించడం లేదనే గుసగుసలు విన్పిస్తున్నాయి.అంతేకాదు… మరికొందరైతే విపక్ష నేతలు చేస్తున్న విమర్శలను ఎంజాయ్ చేస్తూ ముసిముసిగా నవ్వుకుంటున్నారట. అందుకే సభా నాయకుడిగా ఉన్నప్పటికీ తనపై వస్తున్న విమర్శలకు సీఎం రేవంత్‌రెడ్డే స్వయంగా జవాబు చెప్పుకోవల్సి వస్తుందనే టాక్ విన్పిస్తుంది. ప్రతిపక్షం విమర్శలను కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రులు లైట్ తీసుకోవడం ఏంటనేది ఎవరికీ అంతుచిక్కడం లేదు. శాసనసభ లాబీల్లోనూ ఇదే విషయమై అధికార, ప్రతిపక్ష నేతల మధ్య ఆసక్తికర చర్చ జరుగుతోంది.
అసెంబ్లీలో అధికార, ప్రతిపక్షాల మధ్య విమర్శలు, ప్రతివిమర్శలు, ఆరోపణలు, ప్రత్యారోపణలు సర్వసాధారణం. పైగా సభానాయకుడిగా ముఖ్యమంత్రిని టార్గెట్ చేయడమూ కామనే… అయితే విపక్షాలను కంట్రోల్ చేయడానికి సభానాయకుడు కన్నా, మంత్రులు, విప్, ఎమ్మెల్యేలే ఎక్కువగా చొరవచూపుతుంటారు. అంతా అయిపోయాక ముఖ్యమంత్రి మాట్లాడి ఆ అంశానికి ఫుల్‌స్టాప్ పెడుతుంటారు. ఏ శాసనసభలోనైనా ఇదే తీరు కనిపిస్తుంటుంది.
ఈ కారణం వల్లే?
ఐతే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు, మంత్రుల మధ్య సమన్వయం కనిపించడం లేదంటున్నారు. ప్రతిపక్షం విమర్శలపై కౌంటర్ ఇచ్చే బాధ్యతను ఒకరిద్దరు తప్ప… మంత్రులెవరూ పెద్దగా భుజాలపై వేసుకోకపోవడంతో భారమంతా సీఎం రేవంత్‌రెడ్డిపైనే పడుతోంది. ఎమ్మెల్యేలు, మంత్రులు ఎవరూ చర్చల్లో పెద్దగా భాగస్వాములు కాలేకపోవడమే దీనికి కారణమా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.ప్రస్తుత అసెంబ్లీలో కాంగ్రెస్ తరఫున జూనియర్ ఎమ్మెల్యేలే ఎక్కువగా ఉన్నారు. దీంతో సీనియర్లతో సమన్వయం చేసుకోలేకపోతున్నారనే వాదన వినిపిస్తోంది. మంత్రులు భట్టి విక్రమార్క, పొన్నం ప్రభాకర్, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు వంటి కొద్ది మంది మాత్రమే అసెంబ్లీలో సీఎంతోపాటు ప్రతిపక్షాన్ని ఎదుర్కొంటున్నారు. సీనియర్ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తన సబ్జెక్టు వచ్చినప్పుడు మాత్రమే అసెంబ్లీలో గళం విప్పుతున్నారు.
ఇక మిగిలిన వారు ఎవరూ ప్రభుత్వంపై విమర్శలకు పెద్దగా స్పందిస్తున్న దాఖలా కనిపించడం లేదనే గుసగుసలు విన్పిస్తున్నాయి. సీఎం కూడా మంత్రులు కల్పించుకోవాలని సూచిస్తున్నా… వారు పెద్దగా పట్టించుకోకపోవడం అధికార పార్టీలోనే చర్చకు దారితీస్తోంది. అన్నీ సీఎం చూసుకుంటారులే అన్న ఉదాసీన ధోరణే మంత్రులు, ఎమ్మెల్యేల్లో ఎక్కువగా కనిపిస్తుండటంతో ప్రతిపక్షం పైచేయి సాధించేలా కనిపిస్తోందంటున్నారు. మరి ఈ పరిస్థితిని కాంగ్రెస్ ఎలా అధిగమిస్తుంది? అన్నదే ప్రశ్నార్థకంగా మారింది