మరో వివాదంలో రేవంత్ రెడ్డి సర్కారు..!
తెలంగాణలో అధికారంలోకి వచ్చిన మొదటి రోజునే ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి అన్న మాటలు ” తెలంగాణలో కేసీఆర్ అనవాళ్లను మార్చేస్తాము.. లేకుండా చేస్తాము అని.. అన్నట్లుగానే తెలంగాణ ప్రభుత్వ అధికారక చిహ్నం ను మార్చడానికి ప్రయత్నం చేశారు. ముఖ్యమంత్రి ఉండాల్సిన ప్రగతి భవన్ లో డిప్యూటీ సీఎం ను పెట్టారు. ప్రగతి భవన్ పేరు మార్చారు. అఖరికి తెలంగాణ ఆస్తిత్వానికి ప్రతీక అయిన తెలంగాణ తల్లి రూపురేఖలనే సమూలంగా మార్చి సరికొత్త విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. కళ్యాణ లక్ష్మీ ఆపేశారు.. రైతుబంధు రద్ధు చేశారు. భగీరథ నీళ్లను నిలిపేశారు.. కాళేశ్వరాన్ని ఖాళీగా ఉంచారు.
ఒక్కటేమిటి ఇలా కేసీఆర్ హాయాంలో చేసిన పలు సంక్షేమాభివృద్ధి పథకాలను ఆపేయడమే కాకుండా ఆయన తీసుకోచ్చిన పలు సంస్కరణలను రూపురేఖలు లేకుండా ప్రయత్నంలో మునిగిపోయి ఉన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. తాజాగా తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతికశాఖ ఏకంగా ముద్రిత పుస్తకాల్లో కేసీఆర్ చిత్రాలున్న ఫొటోలను చించేసి విక్రయిస్తున్నది. అవేం ఇప్పటికిప్పుడు ముద్రించినవో.. కొత్తవో కాదు. పాత పుస్తకాలు. గతంలో ముద్రించినవే. పూర్తి వివరాల్లోకి వెళ్తే… బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాం లో ‘తారీఖుల్లో తెలంగాణ’ అనే పుస్తకాన్ని ముద్రించారు.
ఈ పుస్తకాన్ని తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ప్రచురించింది. పదేండ్లుగా ఇది ప్రాచుర్యంలో ఉంది. ఎన్టీఆర్ మైదానంలో ప్రస్తుతం నిర్వహిస్తున్న హైదరాబాద్ బుక్ ఫెయిర్‌లో ఈ పుస్తకాన్ని విక్రయిస్తున్నారు.గతంలో ముద్రించిన ఈ పుస్తకంలోని కేసీఆర్ ఫొటో ఉన్న పేజీని చించేసి అమ్ముతుండటం గమనార్హం. ఆయా పేజీకి చించేసిన ఆనవాళ్లు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ పుస్తకాలు విరివిరిగా అమ్ముడయ్యాయి. పోటీ పరీక్షలకు ప్రిపేరయ్యేవారు అత్యంత ప్రామాణిక పుస్తకంగా భావిస్తారు. ఇలాంటి పుస్తకంలో కేసీఆర్ ఫొటో ఉన్న పేజీని చించేసి విక్రయిస్తుండటాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. సర్కారు తీరుపై తెలంగాణవాదులు, కేసీఆర్ అభిమానులు తీవ్రంగా మండిపడుతున్నారు. సర్కారు తీరుపై సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. రేవంత్ సర్కారుపై దుమ్మెత్తిపోస్తున్నారు.