ధరణి సమస్యలపై సమగ్ర చట్టం
ధరణి సమస్యలపై శాశ్వత పరిష్కారం కోసం అవసరమైతే సమగ్రమైన చట్టం రూపొందించాలని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి చెప్పారు. ధరణిలో సవరణలు చేస్తున్న సందర్భంగా కొత్తగా సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ధరణి సమస్యలపై ముఖ్యమంత్రి సచివాలయంలో ఉన్నతస్థాయి సమావేశంలో సమీక్షించారు. సవరణలు చేసే క్రమంలో ప్రజల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవాలని సూచించారు.
సమస్యల పరిష్కారానికి మరింత లోతుగా అధ్యయనం చేయాలని, అవసరమైతే ఈ విషయంలో అఖిల పక్ష సమావేశం నిర్వహించాలని, దీనిపై అసెంబ్లీలోనూ చర్చించి అందరి సూచనలు, అభిప్రాయాలకు అనుగుణంగా సమగ్రమైన చట్టం రూపొందించాలని ఆదేశించారు.
రెవెన్యూ శాఖామాత్యులు శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ముఖ్యమంత్రి సలహాదారు శ్రీ వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు శ్రీ కే.కేశవరావు, మాజీ మంత్రి శ్రీ కుందూరు జానారెడ్డి, ధరణి కమిటీ సభ్యులు శ్రీ ఎం. కోదండరెడ్డి, శ్రీ రేమండ్ పీటర్, శ్రీ ఎం.సునీల్ కుమార్ తో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీమతి శాంతి కుమారి, రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.