మిషన్ భగీరథపై ప్రజలకు విశ్వాసం కలిగించాలి
మిషన్ భగీరథ ద్వారా సరఫరా అవుతున్న తాగు నీటిపై ప్రజలకు విశ్వాసం, అవగాహన కల్పించేలా చర్యలు చేపట్టాలని పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ది, గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖ మంత్రి డాకర్ట్ దనసరి అనసూయ సీతక్క అధికారులను ఆదేశించారు. వేల కోట్లు ఖర్చు చేసి మిషన్ భగీరథ వ్యవస్థను ఏర్పాటు చేసినా… ప్రజలు ఇంకా ఆర్వో ప్లాంట్లు, బోరు నీళ్ల పై ఆదారపడటం పట్ల ఆవేదన వ్యక్తం చేసారు.తెలంగాణ సచివాలయంలో మంత్రి సీతక్క కార్యాలయంలో బుధవారం నాడు మిషన్ భగీరథ బోర్డు సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మంత్రి సీతక్క మాట్లాడుతూ.. మిషన్ భగీరథ ద్వారా సరఫరా అవువున్న శుద్దమైన తాగు నీటిపై ప్రతి గ్రామ పంచాయితీలో ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.
ఆర్వో నీరు, బోరు నీటి ద్వారా దీర్ఘకాలంలో ఏ విధమైన సమస్యలు తలెత్తుతాయో ప్రజలకు వివరించాలన్నారు. ప్రజలు విధిగా మిషన్ భగీరథ ద్వారా సరఫరా అవుతున్న తాగు నీటిని వినియోగించేలా ప్రత్యేక డ్రైవ్స్ నిర్వహించాలని చెప్పారు. మిషన్ భగీరథ నీటి నాణ్యత ను ప్రజలకు వివరించేలా రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు సదస్సులు నిర్వహించాలన్నారు.
రాబోవు వేసవి కాలంలో తాగు నీటి సమస్యలు తలెత్తకుండా ఫిబ్రవరి, మార్చి మాసాల్లో క్రాష్ ప్రోగ్రాం నిర్వహించి డిపార్ట్ మెంట్ అధికారులను, పంచాయతీలను సన్నద్దం చేయాలని సీతక్క ఆదేశించారు.మిషన్ భగీరథ బోర్డు సమావేశంలో మంత్రి సీతక్క తో పాటు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది శాఖ కార్యదర్శి డిఎస్ లోకేష్ కుమార్, మిషన్ భగీరథ ENC కృపాకర్ రెడ్డి, బోర్డు ఇతర డైరెక్టర్లు హజరయ్యారు.