పద్మ శ్రీ అవార్డు గ్రహీత మృతి
తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి ఖమ్మం జిల్లా
మణుగూరు మండలం బావి కూనవరం గ్రామానికి చెందిన పద్మ శ్రీ అవార్డు గ్రహీత సకిని రాంచంద్రయ్య కన్నుమూశారు. అనారోగ్య సమస్యలతో స్వగ్రామంలోనే ఆయన ప్రాణాలు వదిలినట్లు కుటుంబసభ్యులు తెలిపారు.
కంచుమేళం- కంచుతాళం వాయిస్తూ ఆదివాసీ తెగల కథలకు ఆయన దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చారు. మేడారం జాతర ప్రధాన ఘట్టం చిలకలగుట్ట నుంచి సమ్మక్కను గద్దెలపైకి తీసుకువెళ్లే సమయంలోనూ రాంచంద్రయ్య కీలక పాత్ర పోషించేవారు. ఈ కథలు చెప్పే కళాకారుల్లో చిట్టచివరి వ్యక్తిగా ఆయన గుర్తింపు సొంతం చేసుకున్నారు.
రామచంద్రయ్య మృతిపట్ల పలువురు ప్రముఖులు పెద్దఎత్తున సంతాపం వ్యక్తం చేస్తున్నారు. పద్మశ్రీ అవార్డు గ్రహీత సకిని రామచంద్రయ్య మృతి బాధాకరం అని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఆయన మృతి పట్ల ప్రగాఢ సంతాపం తెలిపారు. కోయ, తెలుగు భాషల్లో సమ్మక్క, సారలమ్మ చరిత్రపై కంచుతాళం- కంచుమేళం గానం చేసే గొప్ప వ్యక్తని రామచంద్రయ్యను మంత్రి కొనియాడారు. ఆయన కుటుంబ సభ్యులకు మంత్రి ప్రగాఢ సానుభూతి తెలిపారు.