మీ బాధ్య‌త మాదే

 మీ బాధ్య‌త మాదే

సొంత బిడ్డ‌లా వయోవృద్ధుల సంక్షేమ భాద్య‌త‌ను ప్ర‌జా ప్ర‌భుత్వం నిర్వ‌ర్తిస్తుంద‌ని పంచాయ‌త్ గ్రామీణాభివృద్ది, మ‌హిళా శిశు సంక్షేమ శాఖ‌ల మంత్రి డాక్ట‌ర్ ధ‌న‌స‌రి అన‌సూయ‌ సీత‌క్క హ‌మీ ఇచ్చారు. వయోవృద్ధుల పోష‌ణ‌, సంర‌క్ష‌ణ చ‌ట్టాన్ని ప‌క‌డ్బంధిగా అమ‌లుచేయ‌డంతో పాటు…పిల్లల ప్రేమకు నోచుకోని తల్లిదండ్రులకు తిరిగి ఆస్తిని అప్ప‌గించే చ‌ర్య‌లు చేప‌డుతామ‌న్నారు. వృద్యాప్య పించ‌న్ల మొత్తాన్ని కేంద్ర ప్ర‌భుత్వం పెంచాల‌ని డిమాండ్ చేసారు. అంత‌ర్జాతీయ వ‌యోవృద్దుల దినోత్స‌వం సంద‌ర్భంగా ర‌వీంద్ర భార‌తిలో మంగ‌ళ వారం నాడు అట్ట‌హ‌సంగా తెలంగాణ ప్ర‌భుత్వం వేడుక‌లు నిర్వ‌హించింది. ఈ వేడుక‌లకు ముఖ్య అతిధిగా హ‌జ‌రైన మంత్రి సీత‌క్క వ‌యోవృద్దుల ఫిర్యాదు న‌మోదు కోసం రూపొందించిన యాప్ ను లాంచ‌నంగా ప్రారంభించారు. ఇక నుంచి ఆర్డీవో, క‌లెక్ట‌రేట్ కార్యాల‌యాల‌కు వెల్ల‌కుండానే మీ సేవా కేంద్రాల్లోనే వ‌యోవృద్దులు ఫిర్యాదు చేసుకునే విధానాన్ని మంత్రి సీత‌క్క ప్రారంభించారు.

వ‌యోవృద్దుల కోసం ఆన్ లైన్ ఫిర్యాదు విధానాన్ని ప్ర‌వేశ పెట్టిన మొట్ట‌మొద‌టి రాష్ట్రం తెలంగాణ అని తెలిపారు. పెద్దల కష్టాలు కన్నీళ్లు పంచుకోవడానికి ఒక రోజు వుండాలని ఐక్య రాజ్య సమితి వయోవృద్ధుల దినోత్సవాన్ని ప్రకటించిందని గుర్తు చేసారు. మారిన పరిస్థితుల్లో వయసు పెరుగుతుంటే ఆందోళన కలుగుతుందన్నారు.ఆస్తుల కోసం పెద్దలను అవమానాలు, చీత్కారాలకు గురు చేస్తున్నారని ఆవేద‌న వ్య‌క్తం చేసారు.అంద‌కే పిల్లల ప్రేమ‌కు దూర‌మైన వ‌యోవృద్దుల‌ను త‌మ ప్ర‌జా ప్ర‌భుత్వం అక్కున చేర్చు కుంటుద‌ని తెలిపారు. సొంత కూతుర్ల లాగా వయోవృద్ధులను చూసుకుంటామని హ‌మీ ఇచ్చారు. ఏలాంటి ఇబ్బందులు ఉన్నా మీ సేవ కేంద్రాల ద్వారా ఫిర్యాదులు చేసుకోవచ్చని తెలిపారు. వయోవృద్ధుల కోసం ఉచిత టోల్ ఫ్రీ నెం. 14567 సేవ‌ల‌ను మ‌రింత పటిష్ట పరుస్తామ‌న్నారు.

వయోవృద్ధుల హక్కులు, అధికారాల ప‌ట్ల అవ‌గాహ‌న పెంచేందుకు క‌లెక్ట‌రేట్ల‌లో బోర్డుల‌ను ఏర్పాటు చేస్తామ‌న్నారు మంత్రి సీత‌క్క‌. పిల్లలు సరిగా చూసుకోకపోతే ఆస్తిని తిరిగి పొందే హక్కు వృద్ధులకు ఉంద‌న్న‌మంత్రి, పిల్లల ప్రేమకు నోచుకోని తల్లిదండ్రులకు తిరిగి ఆస్తిని అప్ప‌గిస్తామ‌ని హెచ్చ‌రించారు.
తల్లిదండ్రులు లేకపోతే మన ఉనికే లేదని అంద‌రూ గుర్తించాల‌న్నారు. తల్లిదండ్రుల పట్ల వికృతంగా ప్రవర్తించే దరిద్రం కొంద‌రికి పట్టుకుందని ఆవేద‌న వ్య‌క్తం చేసారు. పేరెంట్స్ ను బాగా చూసుకున్నప్పుడే పిల్లలు మ‌న‌ల్ని బాగా చూసుకుంటారని తెలిపారు. తల్లిదండ్రులతో మ‌నం ప్రవర్తించే తీరునే మ‌న పిల్లలు అల‌వ‌ర్చుకుంటార‌ని..అందుకే పేరెంట్స్ ను మంచిగా చూసుకోవాల‌న్నారు.

ఆస్తులు అంతస్తులు ముఖ్యం కాదని.. బంధాలు అనుబంధాలే ముఖ్యమ‌ని.. అవే మనకు ఓదార్పునిస్తాయని మంత్రి సీత‌క్క పేర్కొన్నారు. పెద్దలను గౌరవిస్తామ‌ని అందరూ ప్రతిజ్ఞ తీసుకోవాలన్నారు. వ‌యో వృద్ధులకు బస్సుల్లో ప్రయాణ రాయితీలు క‌ల్పించే అంశాన్ని…సీఎం రేవంత్ రెడ్డి, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ దృష్టికి తీసుకెళ్లి తగిన చర్యలు తీసుకుంటామ‌న్నారు. తాను ఒక ఉద్యమకారుడు తల్లిని చూసేందుకు వ‌రంగ‌ల్ లో వృద్ధాశ్రమానికి వెళ్లేదానన్ని…అక్కడ వృద్దుల ఆదేద‌న చూసి గుండే త‌రుక్క‌పోయేద‌ని తెలిపారు. వృద్ధాశ్రమాలను సందర్శించినప్పుడు ఎంతో బాధ కలుగుతుందని చెప్పారు. ప్రతి ఒక్కరి జీవితంలో వృద్ధాప్యం రాక మానదని..అందుకే యుక్త వ‌యసులున్న‌ప్పుడు పేరెంట్స్ ను మంచిగా చూసుకోవాల‌ని కోరారు.

వయవృద్ధులకు కేంద్ర ప్ర‌భుత్వం కేవలం రూ. 200 నెల‌వారి పెన్షన్ ఇస్తుందని… ధరలు పెరిగినా గత పది సంవత్సరాలుగా ఒక్క రూపాయి పెన్షన్ కేంద్రం పెంచలేదని గుర్తు చేసారు. అందుకే కేంద్రం పెన్ష‌న్ మొత్తాల‌ను పెంచాల‌ని, లబ్ధిదారుల సంఖ్య‌ను పెంచాల‌ని సీత‌క్క డిమాండ్ చేసారు.అంత‌ర్జాతీయ వయోవృద్ధుల దినోత్స‌వం సంద‌ర్భంగా పలువురు వయవృద్ధులను మంత‌మ‌రి సన్మానించారు. వయోవృద్ధుల సంరక్షణ చట్టాన్ని పటిష్టంగా అమలు చేస్తున్న హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ని మంత్రి ఘనంగా సన్మానించారు. రెండు నెలల్లో 200 వయోవృద్ధుల కేసులను పరిష్కరించిన అనుదీప్ దురిశెట్టిని అభినందించారు.అంత‌ర్జాతీయ వయోవృద్ధుల దినోత్స‌వ వేడుక‌ల్లో మ‌హిళా శిశు సంక్షేమ శాఖ కార్య‌ద‌ర్శి వాకాటి క‌రుణ‌,వయో వృద్ధులు, వికలాంగులు, ట్రాన్స్ జెండర్ల సాధికారత శాఖ డైరెక్టర్ శైలజ, భారి సంఖ్య‌లో వ‌యోవృద్దులు ఈ కార్య‌క్ర‌మంలో పాల్గోన్నారు. వ‌యోవృద్దుల ఆట‌లు, పాట‌లు, నృత్యాలతో వేడుక‌లు మారుమోగాయి.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *